Sunday, June 17, 2012

ఓ అపురూప ప్రేమకథ!


చుట్టూరా కనిపిస్తోందే విశాలమైన ఆకాశమంతా ఒకప్పుడు చీకటిగా నల్లటి నిశ్శబ్దంలో ఉండేది. అప్పుడు అరుదైన అపురూప ఘడియన తన చిరునవ్వు కిరణాలు ఆకాశమంతా ప్రసరించి ముందు తెల్లటి వెలుగుతో మొదలై చివరికి అందమైన నీలివర్ణంగా నిండిపోయింది. అద్భుతాన్ని నేను అబ్బురంగా చూస్తుండగానే మరిన్ని వింతలు జరిగాయి.
అదొక అమోఘమైన సృష్టి కావ్యం.. ఊహకందని ఇంద్రజాలం!
తన పసిమి చూపులు సోకిన ప్రతి చోటా జీవం విరిసింది. తన మోమున ఉదయించిన చిరు దరహాస రేఖలు కాంతి పుంజాలుగా మారి అచేతనంగా ఉన్న విశ్వంలో ఉత్తేజాన్ని నింపాయి. ఎన్నో రంగురంగుల లోకాలకి ప్రాణం పోశాయి.
తను ధారపోసిన శక్తి నాలోనూ ప్రాణప్రతిష్ఠ చేసింది. తన నులివెచ్చని స్పర్శతో నాలో కొత్త ఊపిరి పోసుకుంది. చల్లని చూపులు విరజిమ్మే వెలుగులు నాలో ఆకుపచ్చని జీవాన్ని నింపాయి. జన్మాంతం ఎండి బండ బారిన గుండెలో చిరుజల్లుల్ని కురిపించి యుగాల దాహార్తిని తీర్చాయి. తనలోని దివ్య తేజస్సు కనగానే యుగాలుగా నాలో ఆవరించిన స్తబ్దత ఆవిరైపోయి కొత్త చలనం వచ్చి సమ్మోహన శక్తికి దాసోహమంటూ అప్రయత్నంగానే తన చుట్టూ పరిభ్రమించసాగాను. సరిగ్గా అప్పుడే కాలం కదలడం మొదలైంది.

తన చేత అదృశ్యంగా ఉండే మంత్రదండంతో మంత్రించినట్టు అలవోకగా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు సంభవించాయి. అంతవరకూ కనీ వినీ ఎరుగని అందాలూ, ఆనందాలెన్నో విందులు చేసాయి.
ఆనాటి నుంచీ అనుదినమూ ఉషోదయాల బంగారు క్షణాల్ని, సాయంసంధ్య చిత్రించే రంగవల్లుల్ని, నిశి రాత్రిలో తళుక్కున మెరిసి మురిసే తారల్ని, జాబిలి చేత రాయబారమంపి పండించే వెన్నెలనీ అనుభూతిస్తున్నాను. అంతేనా! ఇంకా.. తెల్లటి మంచంటి స్వచ్ఛతని, వాన చినుకంటి మృదుత్వాన్ని, ఆకాశమంటి విశాలత్వాన్ని, సంద్రమంటి కనిపించని లోతుల్ని, అగ్గిరవ్వంటి ఆగ్రహావేశాల్ని, సుడిగాలంటి ప్రతాపాన్నీ, కారడవుల్లాంటి కాఠిన్యాన్ని, జలపాతమంటి చురుకుదనాన్ని, చీకటి వెలుగులని, సుఖదుఃఖాల్ని, ఆరు రంగుల ఇంద్రధనస్సునీ, ఆరు ఋతువుల నిండిన మాధుర్యాన్ని, కమ్మని తేనెలూరే పూబాలలని, పూరెమ్మల చెక్కిలి పైన ఆర్తిగా నిలిచే మంచు బిందువుల ముద్దుల్నీ, మధుర మకరందాన్ని కొల్లగొట్టిపోయే చిలిపి తుమ్మెదల్ని, రంగురంగు రెక్కల సీతాకోకచిలుకల్ని, మబ్బుల దాకా ఎగిరే పక్షులనీ, రాజసం ఒలకబోసే సింహపు కొదమనీ, విశ్వాసంగా చెలిమి చేసే జంతుజాలాన్నీ, మానవత్వం పరిమళించిన మనిషినీ, అనుపమాన సౌందర్యం మూర్తీభవించిన అతివనీ, పాలు గారే పసిపాపల నవ్వుల్నీ......... ఇలా ఎన్నని చెప్పనూ.. తను అనుగ్రహించిన వరప్రసాదంగా లెక్కకందనన్ని అద్భుతాలకి ఆలవాలమై మహదానందంగా విలసిల్లుతున్నాను నేను.

నిరుపమానమైన స్వయంప్రకాశకత్వం తనకే సొంతం.. అనన్య సామాన్యమైన తన శక్తిసామర్థ్యాలు ఎన్నో జవజీవాలకి ఆధారం.. తన నీడన ప్రాణం పోసుకున్న ఎందరికో తనొక గోరువెచ్చని జ్ఞాపకం.. తన దివ్యస్పర్శ నిత్యనూతనం, అమరం, అజరామరం!
అనుక్షణం తన చుట్టూ పరిభ్రమించడటమే నాలో ప్రాణస్పందనకి నిదర్శనం. ఎన్నటికీ తనివి తీరనంత అనురాగమున్నా నిర్దిష్టమైన దూరాన కట్టి ఉంచడం తనకే సాధ్యమైన స్వయంనియంత్రణ. తన పసిడి కిరణాల వెలుగులు ఇంకా ఎన్నెన్ని ప్రపంచాల్లో జీవం నింపాల్సి ఉన్నాయో కదా.. అందుకని అంతటి శక్తిని ఒడిసిపట్టి బంధించి ఉంచాలనుకోడం అసాధ్యమే కాదు, న్యాయం కూడా కాదుగా మరి.. అందుకే మా మధ్యన తప్పని దూరమన్నమాట!

కాలం పరుగు నేర్చింది తన చేతుల్లోనే.. కాలం కొలత మొదలైంది తన వెంట తిరిగే నా పరుగుతోనే.. తన చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేసిన గడువే కాలచక్రంలో ఏడాదిగా ముద్రపడి తిరిగి నన్ను మొదటి అడుగు వేసిన చోటుకి చేరుస్తుంది. మా ప్రేమ జనించిన తొలి క్షణాన్ని గుర్తు చేస్తుంది. మధుర జ్ఞాపకాన్ని తలచి మురిసి సంతోషంగా సంతృప్తిగా నా పెదవంచున ఒలికే చిన్ని చిరునవ్వు సాక్షిగా మరో ప్రదక్షిణానికి నాంది.. ఇది తుది దాకా అనునిత్యం సాగే మా ప్రేమ ప్రయాణం.. నాకు ప్రాణప్రదమైన మా ప్రణయయాత్ర!


నేను భూమిననీ.. నా ప్రేమయాత్ర సూర్యుడి చుట్టూ.. అని మరి చెప్పక్కర్లేదుగా!



Thursday, June 14, 2012

వానా వానా వల్లప్పా..



వాన.. ఒకటే వాన.. దాదాపు పదినాళ్ళ నుంచీ అస్సలు ఆగనంటూ మేఘాల్లో దాగనంటూ అదే పనిగా కురుస్తున్న జడివాన!
ఆకాశం కేసి చూస్తే నల్లటి మేఘాలే కనపడవు. అలాగని తెల్లటి మబ్బులు కూడా ఉండవు. ఆకాశమంతా ఖాళీ ఖాళీగా పల్చటి తెరలా కనిపిస్తుంది. అదిగో అలా అమాయకంగా అస్సలేం కదలిక లేనట్టు మూర్తీభవించిన మౌనంలా ఉంటుందా.. కానీ మనం కాస్త తల దించి ఏ చెట్ల వైపో, నేల వైపో చూస్తే అప్పుడు కనిపిస్తుంది. అల్లిబిల్లిగా అల్లుకుపోతూ సన్నటి వెండి దారాల్లాంటి వాన తుంపర. అలా నేల రాలుతున్న ఆ చినుకుల నాట్యం చూస్తూ చూస్తూ ఎంతసేపటికైనా సరే అలుపొచ్చో ఆకలేసో మనం పక్కకి తప్పుకోవాల్సిందే తప్ప అది ఆగే వాన కాదు.

నేనిలా అంటున్నానని ఆకాశం ఉడుక్కుంది కాబోలు.. ఉన్నట్టుండి దూరంగా చర్రున చిరుకోపంగా మెరిసిందో ఎర్రటి మెరుపు. క్షణం ఆగి మెరుపు వెనకాలే ఢమఢమా అని గట్టిగా ఉరిమింది. అబ్బో.. అయితే ఈ వానకి అలక నా మీదేనా అనుకునేసరికి నవ్వొచ్చింది.
సరే.. పంతం ఎవరి మీదైతేనేం గానీ ఈ సారి బాగా గట్టి పట్టే పట్టినట్టుంది చూడబోతే.. అందుకే ఇన్ని రోజులైనా ముసురు విడవడం లేదు. ఎవరో వెనకుండి తరుముతూ హడావుడి పెడుతున్నట్టు కాసేపు జలజలా కురవడం, మళ్ళీ తన దోసిట్లో నీళ్ళన్నీ నిండుకున్నాయేమోనన్నట్టు కాసేపు నెమ్మదించడం.. మళ్ళీ విజృంభించడం, కాసేపు శాంతించడం.. ఊ.. బానే ఉన్నాయి ఈ తుంటరి వాన ఆటలు.. తీరిగ్గా దానితో పాటు కూర్చుని నా కలవరింపులు..


అసలూ.. ఇలా వర్షాన్ని చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటికి పరిగెత్తి కాళ్ళకి చెప్పులు లేకుండా వానలో నడవాలనిపిస్తోంది.
కాళ్ళ కింద తడిసిన మట్టి మెత్తగా జారుతుంటే, మరింత గట్టిగా అదిమి పట్టి అడుగులేస్తూ, మధ్య మధ్యన అరికాళ్ళలో సనసన్నగా గిలిగింతలు పెట్టే చిన్న చిన్న రాళ్ళ పలుకుల అల్లరి స్పర్శని అనుభూతిస్తూ, పచ్చటి పాదాలకి గోరింటాకు పండినట్టు ఎర్రటి గుమ్మట్టి బురద అంటుకుపోయేలా గంతులేస్తూ వాన నీళ్ళల్లో ఆడీ ఆడీ, ఇంట్లో నుంచి అమ్మ బెదిరింపుతో కూడిన పిలుపు వినపడేసరికి అయిష్టంగానే వాననొదిలి బుద్ధిగా ఇంట్లోకొచ్చి తల తుడుచుకుని తడి బట్టలు మార్చుకునీ, అప్పటి దాకా అంత వానలోనూ తెలియని చలిని అప్పుడే కొత్తగా గుర్తిస్తూ సన్నగా వణుకుతూ, రెండు కాళ్ళూ దగ్గరగా ముడుచుకుని మోకాళ్ళని గట్టిగా పొట్టలోకి లాక్కుని కాళ్ళ చుట్టూ రెండు చేతులూ వెచ్చగా చుట్టేసి, మోకాళ్ళ మీద గడ్డం పెట్టుక్కూర్చుని, వసారాలో నుంచి ఇంటిపై కప్పిన పెంకుల మీద నుంచి కిందకి జారే వాన నీటి ధారల్ని చూస్తూ, వంట గదిలో నుంచి వస్తోన్న అన్నం ఉడుకుతున్న వాసనకి అప్పటికప్పుడు ఆకలి గుర్తొచ్చి అన్నం కావాలని మారాం చేస్తూ, అప్పటి దాకా వాన నీళ్ళల్లో నానీ నానీ పాదాల మీద ఏర్పడిన చర్మపు ముడతల్ని చిత్రంగా చూసుకుంటూ చూపుడు వేలితో తడుముతూ అలా ఎందుకయ్యిందంటూ అమ్మతో ఆరాలు తీస్తూ, అప్పుడే పొయ్యి మీద నుంచి దించిన పొగలు కక్కుతున్న వేడి వేడి అన్నంలో పప్పుతో పాటు అమృతం కలిపి పెడుతున్న అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ....... ఆహహా.. స్వర్గం అంటే అచ్చంగా అదే కదూ! నిజంగా ఆ చిన్నప్పటి రోజులు ఎంతందమైనవో!


హ్మ్మ్.. ఇప్పుడు బయటికెళ్ళి తడిచే ధైర్యం చెయ్యలేకపోతున్నా.. ఏం చెయ్యనూ.. వానతో పాటు చల్లగాలి కూడా కమ్మేస్తోంది మరి! మరీ ఇన్ని రోజులు ముసురు పట్టడం వల్లేమో వానలో అదే పనిగా తడిచిపోయి ఉన్న చెట్టూ పుట్టా కూడా చలికి వణుకుతున్నట్టు కనిపిస్తున్నాయి నా కళ్ళకి. అస్సలు గుమ్మం దాటి అడుగు బయటకి పెట్టాలనిపించట్లేదు. ఎంతసేపూ ఇలా కిటికీకి అతుక్కుపోయి అలా వానని చూస్తూ కూర్చోడమే బాగుంది.
ఇంటి ముందున్న పచ్చని చెట్టు కింద నేల కాస్త లోపలికి కుంగిపోయి చిన్న గుంటలా ఏర్పడింది. దాన్నిండా వాన నీళ్ళు నిండాయి. చెట్టు మీద చిక్కగా అలుముకున్న ఆకుపచ్చటి నక్షత్రాల్లాంటి ఆకుల మీద నుంచి వాన చినుకులు మెల్లమెల్లగా ఒక్కోటీ కిందకి జారిపడుతున్నాయి. ఒక్కో చినుకూ పడ్డప్పుడల్లా ఏదో మ్యాజిక్ చేసినట్టు ఎక్కడి నుంచో ప్రత్యక్షమైపోయి దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతున్న అలల తరంగాల వలయాలు అలా అలా మధ్యలో మొదలై క్రమంగా పెద్దవవుతూ అంచులదాకా వెళ్ళి చటుక్కున మళ్ళీ ఎక్కడికో మాయమైపోతున్నాయి. ఈ లోపు మళ్ళీ ఇంకో చినుకు.. మళ్ళీ ఇంకోటి.. భలే ఉందీ ఆట! ఈ చినుకుల ఆటకి తాళం వేస్తున్నట్టు పైన పెంకుల మీద నుంచి కిందకి పడుతోన్న వాన నీళ్ళు నేల మీదున్న గులకరాళ్ళ మీద పడి చిత్రమైన శబ్దాలు చేస్తున్నాయి.


ఎవరో పిల్లలు వీధిలో వెళ్తూ కనిపించారు. రైన్ ఈజ్ కమింగ్ అనకూడదు, ఇట్స్ రైనింగ్ అనాలని చిన్నప్పుడు బళ్ళో చెప్పిన పాఠం గుర్తొచ్చింది.
వానొచ్చినప్పుడల్లా సాయంత్రం బడి నుంచి ఇంటికొచ్చే దారిలో వానపాములతో పాటు, బోల్డన్ని వానకోకులు కనిపించేవి. మనం వానకోకు అంటాం గానీ దాని అసలు పేరు వానకోయిల తెల్సా.. అని బళ్ళో ఎవరో స్నేహితులు చెప్పిన గుర్తు. ఇంతకీ వానకోకులంటే ఒక రకం పాములు. పసుప్పచ్చగా ఉంది నల్ల చుక్కలుంటాయి. అది కరిచే పాము కాదనీ, భయపడక్కర్లేదని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. వర్షం వచ్చినప్పుడు తెగ కనిపించేవి ఈ వానకోకులు. వానకి కప్పలు కూడా బయట పడేవేమో, కొన్ని సార్లు కప్పల్ని మింగుతూనో, అప్పుడే మింగేసో కూడా కనపడేవి. అమ్మోయ్.. ఈ మాట చెప్తుంటేనే నాకు భయమేస్తోంది. కరిచేవో కరవనివో తర్వాత సంగతి గానీ అసలీ పాము అన్న పదం వింటేనే చచ్చే భయం నాకు. అనవసరంగా ఇప్పుడిది గుర్తొచ్చింది. :(
పోనీ.. ఈ భయం పోడానికి కాసేపు అర్జునా.. అర్జునా.. అనుకోనా? చిన్నప్పుడు వానొచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద ఉరుములూ, మెరుపులూ, పిడుగులూ శబ్దాలు వినిపిస్తుంటే అమ్మమ్మ చెప్పేది.. "అర్జునా అర్జునా.." అనుకుంటే అస్సలేం కాదు మనకి అని. అర్జునుడు ఏ దేవలోకంలోనో దుష్టశిక్షణ నిమిత్తం యుద్ధం చేస్తుంటే ఆ అర్జున బాణాల ధాటికి ప్రకృతి కంపించి ఇలా ఉరుములూ, పిడుగులూ వస్తాయట. అందుకని మనకి భయమేస్తోందని "అర్జునా.. ఫల్గుణా.." అని వేడుకుంటే కాస్త నెమ్మదిస్తాడన్నమాట అర్జునుడు. భలే ఉంది కదూ కథ! కథే అయినా సరే చిన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండేదో అలా అనుకోవడం. నేనూ, తమ్ముడైతే మరీనూ.. ఈ ఉరుముల శబ్దాల మధ్య మా పిలుపులు ఎక్కడో వేరే లోకంలో ఉన్న అర్జునుడికి వినిపిస్తాయో లేదోనని బాగా ఘాట్టిగా కేకలు వేసేవాళ్ళం అర్జునా అర్జునా అని. :)


హుమ్మ్.. ఇదేం పాడు వానో గానీ అటు తిరిగీ ఇటు తిరిగీ మళ్ళీ మళ్ళీ చిన్నతనంలోకే లాక్కెళుతుంది. జ్ఞాపకాల వానలోంచి కాస్త తెప్పరిల్లి ఈ లోకంలోకి వచ్చి చూస్తే ఎదురుగా కిటికీ అద్దమంతా చిందర వందరగా పరచుకున్న వాన చినుకులు..
కిటికీ అద్దం మీద పడిన చినుకుల మూలంగా అద్దం మసక మసగ్గా అయిపోయింది. ఏడుస్తున్నప్పుడు కూడా అచ్చం ఇంతే కదా.. చుట్టూ ప్రపంచం అంతా మసకబారిపోతుంది. ఏడుపుకీ వర్షానికీ చాలానే పోలికలుంటాయేమో! వాన వెలిసాక ఆకాశం తేటపడినట్టు, ఒకోసారి కళ్ళు వర్షించాక మనసు తేలికపడుతుంది. వాన గురించి ఆ మధ్యెప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తొస్తున్నాయి..

వానెంత పిచ్చిదీ..
నా వేదనని తన కన్నుల్లో కరిగిస్తోంది!
వానెంత మంచిదీ..
నన్నూ, నా కన్నీళ్ళనీ తనలో కలిపేసుకుంటోంది!


Tuesday, June 12, 2012

కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది..


'హాస్యబ్రహ్మ' జంధ్యాల దర్శకత్వంలో 1983 లో వచ్చిన 'నెలవంక' సినిమాలోని పాట ఇది. రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలు, జానకి ఆలపించారు. రాజేష్, తులసి జంటగా నటించిన ఈ చిత్రం హిందూ ముస్లిం మతాలకి చెందిన ఇద్దరు మిత్రుల కుటుంబాల మధ్య జరిగిన కథ. మతాలకి అతీతంగా ఆ ఇరువురి మధ్యన స్నేహం, తర్వాత చోటు చేసుకునే అపార్థాలూ, తద్వారా ఊర్లో మత కలహాలూ, చివరికి మతం కన్నా మానవత్వం గొప్పదనే విషయాన్ని అందరూ గుర్తించేలా చెయ్యడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో సుత్తి జంట హాస్యం చాలా సరదాగా ఉంటుంది. సుత్తి మీద ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంది. :)

ఇంక ఈ పాట విషయానికొస్తే వినసొంపైన సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోతుంటే, అలతి అలతి పదాలతో రాసిన అందమైన సాహిత్యం పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తుంది. ఎప్పట్లాగే జానకి గారు చాలా సున్నితంగా, భావయుక్తంగా పాడారు. ప్రముఖ తెలుగు రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఈ పాటని రాసారు. ఈయన రేడియో కోసం కూడా ఎన్నో రచనలు చేసారట. వీరి తల్లిదండ్రులు, సతీమణి కూడా రచనా వ్యాసంగంలో ఉన్నవారేనట. గ్రహణం, మాయాబజార్ (కొత్తది), అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ తరంలో వైవిధ్యమున్న దర్శకుడిగా పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఇంద్రగంటి మోహనకృష్ణ వీరి కుమారులే.

ఇది చాలా పాత పాటే అయినా నాకీ మధ్యనే తెలిసింది. నాలాంటి వాళ్ళుంటే ఇప్పుడు తెలుసుకుంటారని బ్లాగులో రాస్తున్నా. ఇంత చక్కని పాటని నాకు పరిచయం చేసిన నా స్నేహితురాలికి బోల్డు థాంకులు. :)

ఈ పాట సాహిత్యంలో ఉపయోగించిన ఉపమానాలు చాలా కొత్తగా, వైవిధ్యంగా అనిపించడం వల్లే నాకీ పాట ఎక్కువ నచ్చింది. అసలు పల్లవిలోని రెండు వాక్యాలు ఎంతందంగా ఉన్నాయో కదా.. కన్నెసిగ్గు కనుబొమ్మల పల్లకిలో వధువయ్యిందట.
 
పాట సాహిత్యం మొత్తం చూడండి ఓసారి.

ఈ కోవెల వాకిలిలో ఏదో అడుగు సవ్వడి..
ఏ దేవుడు దయతో నా ఎదలో.. అడుగిడు.. వడి వడి..

కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది.. విరిమొగ్గల మధువయ్యింది..
హరివిల్లై పెదవి వదిలిన చిరునవ్వే వరమయ్యింది.. సిరిమువ్వల వరదయ్యింది..

నీ కన్నుల వెన్నెల చూసి మనసే చిరు తరగయ్యింది.. కృష్ణవేణి పరుగయ్యింది..
దయ నిండిన గుండెని చూసి.. తనువే ఒక పులకయ్యింది.. నునుసిగ్గుల మొలకయ్యింది..

కనురెప్పల గొడుగులు వేసి తోడునీడనవుతాను..
అడుగులకే మడుగులుగా నా అరచేతులు పడతాను..
నీ జడలో మొగలిరేకునై నీ బతుకు పంచుకుంటాను..
నీ జడలో మొగలిరేకునై నీ బతుకు పంచుకుంటాను..

కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది.. విరిమొగ్గల మధువయ్యింది..
హరివిల్లై పెదవి వదిలిన చిరునవ్వే వరమయ్యింది.. సిరిమువ్వల వరదయ్యింది..

అంతరంగమిదిగో స్వామీ.. నేడు నీకు నెలవంటాను..
మూగవడిన నా గుండెలలో.. రాగలహరివనుకుంటాను..
అవధి లేని అంబరమే నా ఆనందపు పరిధంటాను..
అవధి లేని అంబరమే నా ఆనందపు పరిధంటాను..

నీ కన్నుల వెన్నెల చూసి మనసే చిరు తరగయ్యింది.. కృష్ణవేణి పరుగయ్యింది..
దయ నిండిన గుండెని చూసి.. తనువే ఒక పులకయ్యింది.. నునుసిగ్గుల మొలకయ్యింది..

ఈ పాటని చిమట మ్యూజిక్ సైట్లో వినొచ్చు.

Youtube లో చూడొచ్చు.

Friday, June 08, 2012

ఓ లెక్కల పరీక్ష జ్ఞాపకం!



మొన్నొక రోజు మా ప్రొఫెసర్ టీచ్ చేస్తున్న బ్యాచిలర్స్ విద్యార్థుల పరీక్షకి ఇన్విజిలేషన్ చెయ్యాల్సిన పని పడింది. నేనూ, ఇంకో కొలీగ్ ఇద్దరం వెళ్ళాం. మొత్తం పరీక్ష రాసే విద్యార్థులు ఇరవై లోపే. పరీక్ష జరిగే చోటేమో చాలా పెద్ద లెక్చర్ హాల్. అందులో ఈ ఇరవై మంది విద్యార్థులు ఒక మూలకి కూడా వచ్చేలా లేరు. ఇక్కడ నేను గమనించినంతలో మనలాగా ముప్పై, నలభై ఎడిషనల్ షీట్లు తీసుకుని రాయవలసిన పరీక్షలు దాదాపు ఉండవు. ప్రశ్నాపత్రంలోనే ప్రతీ ప్రశ్న కింద ఇచ్చిన ఖాళీలో పట్టేంత సమాధానం రాయాలంతే. అబ్బ.. ఎంత సుఖమో కదా అనిపిస్తుంది నాకైతే. వేరే సబ్జెక్టుల సంగతి నాకు తెలీదు గానీ బయాలజీ వాళ్ళకి మాత్రం రాసీ రాసీ చేతులు పడిపోయేవి మాకు. మధ్యలో బొమ్మలు, రంగులూ.. మళ్ళీ అదొక గోల. మా కాకతీయ యూనివర్సిటీ పేపర్ పేటర్న్ మాత్రం చాలా కష్టంగా ఉండేది. డిగ్రీలో ఉన్నప్పుడు మొత్తం ఆరు పరీక్షలు అయిపోయేసరికి నాకు కుడిచెయ్యి వాపు వచ్చేది. పరీక్ష హాల్లో చేతికున్న వాచీ తీసి పక్కన పెట్టుకుని, పెద్ద పెన్సిల్ బాక్స్ నిండా రంగురంగుల స్కెచ్ పెన్నులు (ఇవి అమ్మాయిల దగ్గర మాత్రమే ఉంటాయి ఎందుకో మరి! ;-) పెట్టుకుని పరీక్ష రాసే పిల్లల్ని చూస్తే బోల్డు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకు. డిగ్రీ పరీక్షలప్పుడు నా తర్వాతి రోల్ నంబర్ మధు అనే అబ్బాయిది. అసలా అబ్బాయి ఒకడు క్లాసులో ఉన్నాడనే నాకు తెలిసేది కాదు. ఎందుకంటే పరీక్షలప్పుడు తప్పించి ఇంకెప్పుడూ కనిపించేవాడు కాదు. అసలే చేతులు నొప్పులోచ్చేలా రాయలేక నేను చస్తుంటే మధ్య మధ్యలో వెనక నుంచి "మధూ.. మధూ.." అని పిలిచి చావగొట్టేవాడు. :-))

అసలు పరీక్షలనగానే ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా.. చిన్నప్పుడు ఏడో తరగతి కామన్ ఎక్జాంస్ అని తెగ శ్రద్ధగా చదివేసిన రోజులు, పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రహసనాలు, ఇంటర్లో మార్కులూ, పర్సంటేజీల కోసం పడిన పాట్లు, విజయమో వీరస్వర్గమో అన్నట్టు రాసిన ఎంసెట్ పరీక్షలు, డిగ్రీలో చదివిన టెక్స్టు బుక్కులు, నోట్సులూ, జిరాక్సులూ, మోడల్ పేపర్లూ, టెస్ట్ పేపర్లూ, ఎమ్మెస్సీ కోసం రకరకాల ఎంట్రన్సు పరీక్షలు, యూనివర్సిటీకొచ్చాక సెమిస్టర్ పరీక్షలు, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్, అసైన్మెంట్స్, సెమినార్స్, చివరిగా పీహెచ్డీ డిఫెన్స్ దాకా మొత్తం అన్నీ సినిమా రీళ్ళలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి ఆ కాసేపు. నా ఏడో తరగతప్పటి లెక్కల పరీక్ష ప్రహసనం ఒకటి గుర్తొచ్చింది.

నా జీవితం మొత్తంలో అత్యంత శ్రద్ధగా పరీక్షలకి చదివిన రోజులంటే ముందు ఏడో తరగతే గుర్తొస్తుంది నాకు. అసలే ఐదు నుంచి ఏడుకి ఎగిరి దూకడం వల్ల మిగతా వాళ్ళందరితో పోటీ పడి చదవడం భలేగా ఉండేది. మా క్లాసు మొత్తంలో పదో పన్నెండో మంది ఉండేవాళ్ళం. పల్లెటూర్లో అంతకంటే ఎక్కువ ఉండరుగా మరి. అసలు ఆ ఏడాదంతా దాదాపు స్కూల్లోనే బతికేసా నేను. పరీక్షలు ఇంకో మూడు నెలల్లో ఉన్నాయప్పటి నుంచీ మా దినచర్య ఎలా ఉండేదంటే, సాయంత్రం స్కూలు అయిపోయాక ఇంకో రెండు గంటలు అక్కడే ఉంది చదువుకుని, రాత్రికి ఇంటికెళ్ళి స్నానం, భోజనం ముగించి మళ్ళీ స్కూలుకి వెళ్ళేవాళ్ళం. రాత్రి పదిన్నర దాకా చదువుకుని, అక్కడే పడుకుని మళ్ళీ ఉదయం నాలుగున్నరకల్లా లేచి ఏడున్నర దాకా చదువుకుని అప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ స్కూలుకి తయారై వచ్చేవాళ్ళం. మధ్యలో ఆటలూ, ముచ్చట్లూ, దిక్కులు చూడటాలూ అన్నీ ఉన్నా సరే, కేవలం పదేళ్ళ వయసులో అంతసేపు బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని కూర్చోడం, ఎలాగైనా సరే ఇంకా బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి అన్నంత పట్టుదల మాత్రం భలే ముచ్చటేస్తుంది ఇప్పుడు తలచుకుంటే. ఇప్పుడసలు అంత క్రమశిక్షణ, శ్రద్ధ బొత్తిగా లేవుగా మరి.. అందుకనన్నమాట. ;-)

అప్పట్లో మా క్లాసులో శ్రీ అనే అమ్మాయికి లెక్కల్లో ఫస్టు, ఎప్పుడూ వందకి తొంభై పైనే వస్తాయి అని గొప్ప పేరుండేది. నాకు కూడా బానే మార్కులు వచ్చేవి గానీ ఎంతైనా లెక్కల్లో చురుకుదనమంటే మా అందరి కంటే కూడా ఆ పిల్లకి స్పెషల్ పేరన్నమాట. అయితే మేథ్స్ ఫైనల్ ఎక్జాం జరిగే రోజున ఆ అమ్మాయి నా వెనుకే కూర్చుంది. పరీక్ష దాదాపు చివరికొచ్చేసాక మా ఇన్విజిలేటర్ బయట తలుపు దగ్గరికెళ్ళి పక్క రూంలోని ఇన్విజిలేటర్ తో మాట్లాడుతూ నించునేసరికి ఎంచక్కా గదిలో పిల్లలందరూ గుసగుసలాడుకోడం మొదలెట్టారు. అప్పుడు నా వెనక కూర్చున్న శ్రీ నన్ను పిలిచి ఫలానా పదహారో బిట్టుకి సమాధానం రాసావా అని అడిగింది. ఊ అన్నా.. నాక్కొంచెం సందేహంగా ఉంది. నీకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పు అంది. ఎంత లెక్కల్లో క్వీన్ అయినా ఏదో అడిగింది కదా, నా స్నేహితురాలు కదాని చెప్పా. తర్వాత కాసేపటికి నాక్కూడా ఒక బిట్ గురించి డౌట్ వచ్చింది. నేను కూడా తనని పిలిచి ఫలానా ప్రశ్నకి ఆన్సర్ నాకు X వచ్చింది కరక్టే కదా.. అని అడిగాను కన్ఫర్మ్ చేసుకుందామని. తను బదులివ్వలేదు. వినపడలేదేమోనని మళ్ళీ ఇంకో రెండు సార్లు పిలిస్తే చివరికి ఏమో నాకు తెలీదు అనేసింది.
ఇంకంతే.. నాకు గొప్ప అవమానం అయిపోయింది. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగిపోయాయి. ఎలాగో పరీక్ష ముగించేసి బయటికొచ్చాక మా మాస్టారు దగ్గరికి వెళ్ళి భోరున ఏడ్చేసా. ఆయన నా ఏడుపు చూసి కంగారు పడి ఏంటమ్మా ఏమైంది, సరిగ్గా రాయలేదా పరీక్ష అనడిగితే ఒక పది నిమిషాలు టైం తీసుకుని అతి కష్టం మీద ఎక్కిళ్ళ మధ్యలోంచి లేదండీ పరీక్ష బానే రాసాను. ఇలా ఒక్క బిట్టు గురించి శ్రీని అడిగితే తను నాకు చెప్పలేదండి.. అని చెప్పి మళ్ళీ ఏడుపు కొనసాగించా. ఆయన నాకు నాలుగేళ్ల వయసు నుంచీ గురువు. వాళ్ళ సొంత కూతురితో సమానంగా చూసుకునేవారు (చూసుకుంటారు ఇప్పటికీ). ఆయన అనునయంగా నన్ను దగ్గరికి తీసుకుని ఇలా ఏడుస్తారా ఎవరన్నా పిచ్చి పిల్లలాగా. తను నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పి సహాయం చేసావు. అది మంచి పద్ధతే కానీ, అందరూ ఒకలాగా ఉండరు కదా! అయినా తను చెప్పలేదని నువ్వు ఏడవడం కాదు ఇప్పుడు చెయ్యాల్సింది. ఇంకోసారి అసలు అలా మరొకరిని అడగాల్సిన అవసరం రాకుండా మనమే ఇంకా బాగా చదువుకుని పరీక్షకి వెళ్దాం అనుకోవాలి. ఆ పట్టుదల రావాలి తప్ప ఇలా ఎవరో చెప్పలేదని ఏడవకూడదు అని చాలాసేపు ఓదార్చి ఏడుపు మాన్పించారు.

ఈ లోపు ఒకటే గోల గోల పరీక్ష సెంటర్లో.. ఏవిటంటే మా పరీక్షా పత్రాలు ముందే లీక్ అయ్యాయనీ, వేరే స్కూళ్ళ వాళ్ళకి చాలామందికి పరీక్షకి ముందే పేపర్ తెలిసిపోయిందనీ, ఇలా జరిగిన కారణంగా మళ్ళీ రీ ఎక్జాం ఉండే అవకాశం ఉందనీ తెలిసింది. ఇంకప్పుడు మా మాష్టారు "చూసావా, మళ్ళీ పరీక్ష ఉండొచ్చు అంటున్నారు. నీకింకో అవకాశం వస్తుంది మళ్ళీ.. నువ్వింకా బాగా చదివి ఈ పరీక్షని మరింత బాగా రాయొచ్చు" అని చెప్పారు. మళ్ళీ నెల తర్వాతో ఏమో మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు మళ్ళీ జరిగాయి. బాగానే రాసాను. విచిత్రంగా నాకు అన్నీ సబ్జెక్టుల కంటే లెక్కల్లోనే ఎక్కువగా 92 మార్కులు వచ్చాయి. మొత్తం క్లాసులో ఉన్న అందరి కంటే, లెక్కలు బాగా చేస్తుందనే పేరున్న ఆ అమ్మాయి కంటే కూడా నాకే ఎక్కువ వచ్చాయి. ఇంకేముందీ.. ఎగిరి గంతేశాను. కానీ, ఆ అనుభవం తర్వాత మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడూ ఎవ్వర్నీ పరీక్షలో సహాయం అడగలేదు. నాకు రాకపోతే ఆ ప్రశ్న వదిలేసి వచ్చానేమో తప్ప ఎవర్నీ అడగాలనుకోలేదు. అంత పెద్ద పాఠం నేర్చుకున్నానన్నమాట. ఆ సంఘటన గురించి ఇప్పుడాలోచిస్తే మా మాష్టారి గురించి చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను ఏడుస్తున్నా సరే ఆ అమ్మాయి వైపు తప్పున్నట్టు అస్సలేమాత్రం మాట్లాడకుండా నా తప్పే నాకు ఎత్తి చూపించారు. ఈ రోజుల్లో అంత ప్రేమగా బుద్ధులు నేర్పించే టీచర్లు ఉన్నారో లేదో గానీ నాకైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఎన్నో విషయాల మీదే ఆధారపడి మన వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుందేమో అనిపిస్తుంది.

Wednesday, June 06, 2012

నా కవితకి ఆంగ్లానువాదం - "Enduring Search …"

N.S మూర్తి గారు నడుపుతున్న 'అనువాదలహరి' బ్లాగు మన బ్లాగు మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. ఆ బ్లాగులో వివిధ ప్రపంచ భాషల కవితలే కాకుండా అప్పుడప్పుడూ మన బ్లాగర్లు రాసిన తెలుగు కవితల్ని కూడా ఆయన ఆంగ్లంలోకి అనువదిస్తుంటారు.

నేను రాసిన ఒక 'నా అన్వేషణ' అనే కవితని 'EnduringSearch…' పేరుతో ఆంగ్లంలోకి అనువదించడం చాలా సంతోషాన్ని కలిగించింది. నిజానికి ఆయన రాసిన అనువాదం చూసాక నేను రాసిన దానికన్నా అదే ఎక్కువ నచ్చేసింది నాకు. నేనా మాటంటే "మాతృకలో లేనిది అనువాదంలో ఎలా వస్తుందమ్మా.." అనడం ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం. జీవితంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎక్కువ జ్ఞానం సంపాదించేకొద్దీ మరింత ఒదిగి ఉండాలనే గుణం అలవరచుకోవాలని ఆయనతో మాట్లాడిన ప్రతీసారీ అనిపిస్తుంది నాకు. :)

ఆయన రాసిన నా కవిత అనువాదాన్ని నా బ్లాగులో భద్రంగా దాచుకోవాలన్న కారణంతో పాటు, అందరూ తప్పక చూడతగిన 'అనువాదలహరి' బ్లాగు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ పోస్టు ద్వారా కొందరికైనా తెలియవస్తుందనీ మూర్తి గారి అనువాదాన్ని ఇక్కడ మళ్ళీ రీ-పోస్ట్ చేస్తున్నాను.
 
మూర్తి గారూ, నా బ్లాగ్ముఖంగా మీకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

[For the first look and for a finicky reader, it may sound funny and ridiculous(may even sound foolish) when you say you are searching for something you never knew. But if we honestly assess our lives and its pursuits, we would have to, perhaps, admit that our life is a marathon search for something we never knew clearly. Even if we had achieved something, instead of living contented with what we have achieved,  like a child who cries for the toy that it did not have ignoring all that it had, we suffer with a sense of dissatisfaction and a craving for something that we did not achieve. Even at the threshold of death, our search for that unknown shall not cease. Its my opinion that this  poem puts that idea so succinctly.]

Yesterday… today…
Day in and day out…and,
For eons…
I have been on the search ….

What is it that I am seeking after?
Who for I am searching for?
What are the places I am looking about?
But,
Why should I search for, at all?
I don’t know!
It is an infinitum of questions …
With no definite answers.

*


Did I ever allow something
To slip through my hands any where?
I don’t think so.
But yet,
I search for that elusive thing
With the illusion that I own it.
Time is fleeting… days are thawing.
Hopes are vanishing… Faith is retreating
Life is ceasing… and the Spirit, depleting
Yet, that crazy search continues…
Cutting through the dense deep darknesses…
To the limits of horizon and to the depths of oceans
For that evanescent enigmatic something
Till breath snaps
Till spirit saps
My being becomes ethereal…
Maybe,
This search shall endure… ever… for ever!

*********************

నా అన్వేషణ!

[మనకు తెలియని వస్తువుగురించి మనం వెతుకుతున్నామని చెబితే, స్థూల దృష్టికి చిత్రంగానూవంకలు వెతికే వారికిహాస్యాస్పదంగానూ కనిపించవచ్చు. కాని, మీరు అవేవీ పట్టించుకోకుండా, "మీ జీవిత గమ్యం ఏమిటి? మీరేం సాధిద్దామనుకుంటున్నారు?" అని నవ్వుతున్నవారిని ఒక్కసారి అడిగి చూడండి. ఆ నవ్వులు, హేళనలూ ఆగిపోతాయి. ఈ దైనందినజీవితపు పరుగుపందెంలో అందరితోపాటు మనమూ పరిగెత్తితున్నాం. ఎందుకుపరిగెత్తుతున్నామో తెలీదు. దేన్ని సాధించడానికి పరిగెత్తుతున్నామో తెలీదు. ఒకవేళ ఏదైనా సాధించినా, అది ఇచ్చే సంతృప్తి కంటే, సాధించలేని విషయాలిచ్చే అసంతృప్తి ఎక్కువ. జీవిత చరమాంకంలో కూడా ఈ అసంతృప్తి మనల్ని వదలదు.'శిలాలోలిత'లో, రేవతీదేవిగారు రాసిన "దిగులెందుకో చెప్పలేని దిగులు"లాంటి భావన ఇది. ఈ భావాన్ని, మధురవాణిగారు ఇందులో చక్కగా ప్రకటించగలిగేరని నా అభిప్రాయం.]

నిన్నా నేడూ పగలూ రాత్రీ అనుక్షణం నిర్విరామంగా వెతుకుతూనే ఉన్నాను..
యుగయుగాల నుంచీ సాగుతోందీ వెతుకులాట..
దేని కోసం వెతుకుతున్నాను?
ఎవరి కోసం వెతుకుతున్నాను?
ఎక్కడని వెతకాలి?
అసలెందుకు వెతకాలి?
ఏమో.. అన్నీ ప్రశ్నలే తప్ప జవాబుల్లేవు!
నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..
కాలాలు కదలిపోతున్నాయ్.. రోజులు తరిగిపోతున్నాయ్..
ఆశలు చెదిరిపోతున్నాయ్.. నమ్మకాలు చెరిగిపోతున్నాయ్..
ఆయువు కరిగిపోతోంది.. ప్రాణం ఇగిరిపోతోంది..
ఇంకా ఇంకా చీకటిని చీల్చుకుంటూ ఆకాశపు అంచుల దాకా.. సముద్రపు లోతుల దాకా..
ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
ఊపిరి కొడగట్టే దాకా.. ప్రాణం కడగంటే దాకా..
నా అస్థిత్వం ఆవిరైపోయే క్షణం దాకా..
ఈ నా అన్వేషణకి అంతనేదే లేదేమో!